- ములుగులో వినూత్న ప్రజాదర్బార్ మోడల్
- రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న మంత్రి సీతక్క

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (సింగిడి): (Seethakka) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా ప్రజాకేంద్రీకృత పరిపాలనలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి సమస్యలు చెప్పాల్సిన సాంప్రదాయ విధానానికి భిన్నంగా, “ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి” అనే ఆలోచనతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో గ్రామ స్థాయిలో ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అడవులు, గిరిజన తండాలు అధికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో మారుమూల గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రాలకు పలుమార్లు వెళ్లి సమస్యలు వినిపించడం కష్టసాధ్యమనే అంశాన్ని గుర్తించిన మంత్రి సీతక్క, ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లాలో…

రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లాలోని వెంకటాపురం, మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, ములుగు, తాడ్వాయి, వెంకటాపూర్, మల్లంపల్లి మండలాల పరిధిలోని మొత్తం 63 గ్రామపంచాయతీలలో ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక మంత్రి దనసరి అనసూయ సీతక్క స్వయంగా పాల్గొని, అప్పటి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ప్రస్తుత జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గ్రామాల్లోనే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వినతిపత్రాలను స్వీకరించారు. ప్రత్యేక ప్రజాదర్బార్‌లో ప్రజలు భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, నూతన పెన్షన్లు, తాగునీరు, అంతర్గత రహదారులు, విద్యుత్, రెవెన్యూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అంశాలపై అర్జీలు సమర్పించారు. అందిన ప్రతి దరఖాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి, జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ప్రజల వద్దకే అధికార యంత్రాంగం…
(Seethakka) సాధారణంగా ప్రజలు జిల్లా కేంద్రాలకు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమస్యలు వినిపించే విధానానికి భిన్నంగా, ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాలకు చేరుకుని సమస్యలను నేరుగా స్వీకరించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. అడవులు, గిరిజన తండాలు అధికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సిన ఇబ్బందులను ఈ కార్యక్రమం గణనీయంగా తగ్గించింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాలు, సంక్షేమ శాఖలు ఇతర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజాదర్బార్‌లో వచ్చిన ప్రతి వినతిపై ప్రత్యేక చర్యలు చేపట్టాయి.ప్రజాదర్బార్‌లో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నమోదు వ్యవస్థ ఏర్పాటు చేసి, దరఖాస్తుదారులకు వాటి పరిష్కార స్థితిని నిరంతరం తెలియజేసే విధంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. న్యాయబద్ధమైన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ, ఇతర పెండింగ్ అంశాలపై నిరంతర ఫాలోఅప్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, కొత్త రేషన్ కార్డులు, నూతన పెన్షన్ల కోసం వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం తీసుకొచ్చే దిశగా ఈ ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది.
మహిళల జీవితాల్లో ఉపాధి వెలుగులు…

ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమం కేవలం సమస్యల స్వీకరణకే పరిమితం కాకుండా, ప్రజల జీవనోపాధికి ప్రత్యక్ష పరిష్కారాలు అందించే వేదికగా కూడా నిలిచింది. ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన మహిళలు, మంగపేట మండలానికి చెందిన మహిళలు తమకు సరైన ఉపాధి అవకాశాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని, జీవనోపాధి కల్పించాలని మంత్రి సీతక్కకు ప్రజాదర్బార్‌లో వినతిపత్రాలు సమర్పించారు. ఈ వినతిపై వెంటనే స్పందించిన మంత్రి సీతక్క, రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థతో సమన్వయం చేసి కేవలం 48 గంటల వ్యవధిలోనే మంగపేట మండలానికి చెందిన 10 మంది మహిళలకు, ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన 15 మంది మహిళలకు మొత్తం 25 ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. అర్జీ స్వీకరణ నుంచి పరిష్కారం వరకు అత్యంత వేగంగా స్పందించి సహాయం అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం ఆ మహిళలు కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల కుట్టింపు పనులను మహిళా సంఘాల ద్వారా చేపట్టే విధంగా ప్రోత్సహిస్తూ, మహిళలకు మరింత స్థిరమైన ఆదాయ వనరులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఈ చర్యలు మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశను చూపించాయి.
ఆఫీసుల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేకుండా..

ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గడమే కాకుండా, గ్రామ స్థాయిలోనే సమస్యల నమోదు, పరిశీలన, పరిష్కార ప్రక్రియ వేగవంతమైంది. (Seethakka) శాఖల మధ్య సమన్వయం పెరిగి, సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు వెలుగులోకి వచ్చి పరిష్కార దిశగా అడుగులు పడ్డాయి. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రారంభమైన ఈ ప్రజాకేంద్రీకృత పరిపాలన విధానం ప్రస్తుతం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ, ప్రజా పాలనలో కొత్త ప్రమాణాలను సృష్టించింది. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లి, సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి అవకాశాలు కల్పించిన ఈ ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” విజయవంతమైన అమలుకు ములుగు జిల్లా నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.







