ఎడిటర్స్ కామెంట్..🖋️🖋️🖋️🖋️: సార్ గిదేంది సార్..

Share this:

– మీ కాల్మొక్త బాంచన్.. ఇగనన్నా రియల్ ఎస్టేట్ దందాలు బంజేయుర్రి.. మీకు పుణ్యముంటది
– పంతుళ్లే గిట్ల ఫెయిల్ అయితే ఎట్లా?
– ఇంక పోరగాళ్లకు ఏం శెప్తరు?
– ఈ ముచ్చట తెల్శినంక ఎవలన్న సర్కారు బడికి అత్తరా!
– వణుకు పుట్టిస్తున్న ఫలితాలు

సవాట్లున్న సర్కారు బడికి మా వోడు పోతండంటే అందరికీ చులకన. వీడు సదివిండు తియ్యి.. ఇయ్యాల్ రేపటి జిందగీల వీడేం బతుకుతడు.. అని చిన్న చూపు. ఇప్పుడు మేమేం చెప్పే ముచ్చట గిట్ల మీకు ఎరుకైందో.. సర్కారు బడికి పోరగాళ్లు పోతార్రంటే గుండె గుబేలుమనుడు ఖాయం. సర్కారు బళ్ల ఉండే సార్లు పెద్ద, పెద్ద సదువులు సదివినోళ్లు. వాళ్లందరూ రేయింబవళ్లు కష్టపడి సర్కారు నౌకరికి సెలెక్ట్ అయినోళ్లు అనే భావన ఇన్నొద్దులు ఉండేది. కానీ ఇప్పుడు ఇక ఆ రోజులు పోయినయి అనిపిత్తందుళ్లా? ఈ ముచ్చట సదివినంక ఒక్కసారే కాళ్ల కింద భూమి కంపించినట్టు అయింది. ఈ సదువు రానోళ్లా.. మన పోరగాండ్లకు సదువు శెప్పేది అని ఏక్ మినిట్ మైండ్ బ్లాంక్ అయింది. ‘తెలంగాణ టెట్ పరీక్షలో 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్ అయిర్రు.. కేవలం 37.29 శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే పాస్’ అనే వార్తను సూశినంక అప్పు శేశయినా సరే.. పోరగాండ్లను ప్రైవేట్ స్కూల్ కే పంపాలె అని అనిపిత్తంది. మరి మీరేమంటరుళ్లా.

పంతుళ్ల పతనానికి కారమేంది?

ఈ వార్త ఎవలికైనా షాక్ లాంటిదే. ఒకప్పుడు సర్కారు బడి సారురా అంటే ఏక్ దం షాన్ ఉంటుండే. కానీ ఇప్పుడు రోజులు మారినయ్. ఎన్నో పరీక్షలను క్లియర్ చేసి నౌకరిలకచ్చిన పంతులు కూడా పరీక్ష పాస్ కాలే అనే ముచ్చట ఇంటే శానా బాధయితంది. ఈ పతనానికి అనేక కారణాలున్నయి. ప్రస్తుతం కారణాలతో విమర్శలు చేసే బదులు పంతుళ్లు పూర్వవైభవం తెచ్చుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిద్దాం.

గమనిక: సర్కారు బడి టీచర్లంటే ఉన్న అపారమైన గౌరవం వల్ల కలిగిన బాధ నుంచి వచ్చిన వ్యాఖ్యలు మాత్రమే కానీ వాళ్లని కించపర్చాలని, తక్కువ చేయాలనే ఉద్ధేశం ‘సింగిడి’ యాజమాన్యానికి లేదని గమనించగలరు. సర్కారు బళ్లె చెప్పే సార్లంటే మాకు ఎనలేని గౌరవం. ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోరని ఆశిస్తూ..

 

 

 

 

 

 

 

 

 

 

 

మోహన్ పూసాల
సింగిడి ఎడిటర్ & మేనేజింగ్ డైరెక్టర్

 

 

 

Share this:
error: Content is protected !!