- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.. రెవెన్యూ, నీటిపారుదల శాఖ సర్వే రిపోర్టును సమర్పించిన ఏఏజీ
- సల్కం చెరువులో ఉందని మ్యాపుల్లో కనవడుతంది కదా?
- జమానాల ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎట్ల తగ్గుతది?
- ఈ చెరువు ముచ్చట్ల హైడ్రా ఏం చేసింది?
- నచ్చినోళ్లని వదిలేస్తరా?
- సీఎం కళ్లు కనిపిస్తలేవేమో: టీఆర్ఎస్ చీఫ్

హైడ్రా ఉన్నదే చెరువులు, కుంటలను కాపాడనీకి.. అవతలోళ్లు ఎంత పెద్దోళ్లు అయినా చెరువులు ఆక్రమిస్తే హైడ్రా ఇడిశిపెట్టది. వాళ్లెనుక ఎవలున్నా వాళ్లు కట్టినయి కూలగొడుతది. బుల్డోజర్ తీసుకపోయి కూలకొట్టనిది హైడ్రాకు నిద్ర పట్టదు. హైదరాబాద్ ల ఒక్క ఆక్రమణ కూడా ఉండకుండా సూత్తం.. అని హైడ్రా చెప్పుకుంది. కట్ చేస్తే చాలా చోట్ల బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టింది. కొంత మంది రాజకీయ నాయకుల ఇండ్లను, కంపౌండ్ గోడలను, ఫామ్ హౌజులు హైడ్రా బుల్డోజర్ల కింద నలిగాయి. కొంత వ్యతిరేఖత వచ్చినా.. హైడ్రా ఏదో బాగు చేస్తుందని కొంత మంది హైడ్రాను సపోర్ట్ చేశారు. ఇదే సమయంలో చాలా మంది హైడ్రాకు సల్కం చెరువును ఆనుకుని ఉన్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థల గురించి విన్నవించారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఈ భవనం గురించి చర్చ నడిచింది. దీన్ని హైడ్రా కూలగొడుతుందా అని అంతా చర్చించుకున్నారు. అప్పట్లో హైడ్రా బాస్ రంగనాథ్ ఒవైసీ అయినా ఎవరు అయినా చెరువును ఆక్రమిస్తే వదిలేది లేదని, అందులో చదువుతున్న విద్యార్థుల విద్యా సంవత్సరం పాడు కాకూడనే ఉద్దేశంతో ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇక ఇప్పుడు ఆ ఫాతిమా ఒవైసీ కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలోనే లేదని హైడ్రా చెబుతోంది.
సింగిడి, హైదరాబాద్: నగరంలోని సల్కం చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోనే ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం ఉందని చాలా మంది ఆరోపిస్తూ వచ్చారు. కానీ అలాంటిదేం లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ తాజాగా హైకోర్టుకు సమర్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద సల్కం చెరువు కట్టను అభివృద్ధి చేశారని.. అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు లేవని ఆయన కోర్టుకు చెప్పారు. ఒవైసీ విద్యాసంస్థను సల్కం చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కట్టారని పేర్కొంటూ విజయ్‌గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేశారు. విచారణ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా రూపొందించిన నివేదికను అదనపు అడ్వకేట్ జనరల్ ఖాన్ హైకోర్టుకు సమర్పించారు.


ప్రశ్నల వర్షం..
ఈ రిపోర్టును, సంబంధించిన మ్యాపులను పరిశీలించిన ధర్మాసనం ఖాన్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ‘చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు మ్యాపుల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎఫ్టీఎల్ ఆక్రమణకు గురి కాలేదని మీరెలా చెబుతున్నారు? గత కాస్ర పహాణీల్లో చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా రికార్డయి ఉందని 2016లో సల్కం చెరువు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు తగ్గుతుందా? పదేళ్లుగా ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌పై తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు?’ అంటూ నిలదీసింది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు నచ్చినవారి పట్ల ఒక విధంగా, ఇతరుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆక్షేపించింది. చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నామని చెబుతున్న హైడ్రా.. ఈ చెరువు విషయంలో ఏం చేసిందని ప్రశ్నించింది.

సీఎంకు కవిత సూటి ప్రశ్నలు
హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్ పేదలను బుల్డోజర్ల కింద నలిపేస్తున్న రేవంత్ సర్కార్ ఒవైసీ విద్యాసంస్థలను కాపాడటానికి ఏకంగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నది.
చెరువును కబ్జా చేసి కట్టిన కాలేజీ ప్రపంచమంతా చూస్తున్నా సీఎంకు మాత్రమే కనిపించడం లేదంటే తక్షణమే ఆయన కంటి పరీక్ష… pic.twitter.com/FZU5PLTGZg
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 10, 2026
ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆమె మాట్లాడుతూ… ‘ఒవైసీ విద్యా సంస్థలను కాపాడేందుకు సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. రేవంత్ సర్కార్ హైడ్రాను ఉపయోగించుకుని నగరంలోని పేదలను బుల్డోజర్ల కింద నలిపేస్తోంది. ఒవైసీ కాలేజీ చెరువును కబ్జా చేసి కట్టారని విశ్వమంతా కనిపిస్తున్నా సీఎంకు మాత్రమే కనిపిస్తలేదేమో. సీఎం వెంటనే కంటి పరీక్ష చేయించుకోవాలి’ అని ట్వీట్ చేశారు.



