KISHAN REDDY: బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్లనే సింగరేణి అధోగతిపాలు

Share this:
  • రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థను వాడుకుంటున్నారు
  • సింగరేణి మరింత బలోపేతానికి కేంద్రం కృషి
  • తాడిచర్ల -2 కోల్ బ్లాక్ తెలంగాణకు మణికిరీటం
  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి
  • భూపాలపల్లిలో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో/భూపాలపల్లి ప్రతినిధి, జూలై 14(సింగిడి):
రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ వల్లనే సింగరేణి సంస్థ అధోగతి పాలైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. బిజెపి సింగరేణి భరోసా యాత్రలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే-8 సింగరేణి గనిలో మంగళవారం బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు అప్పని శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేటీకే -8 గనిని సందర్శించిన కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు, బిజెపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహించారు. మంత్రి కిషన్ రెడ్డి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా దేశ అభివృద్ధికి ఇంధనంగా నిలుస్తున్న సింగరేణి కార్మికుల కృషి దేశానికి ఎంతో విలువైంది అని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలు, వైఫల్యాల కారణంగా సింగరేణి కార్మికుల్లో అభద్రతాభావం, ఆందోళన పెరిగిందని అన్నారు. సింగరేణిని దేశంలోనే అత్యంత కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థగా బలోపేతం చేయాల్సిన గత ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నాయని విమర్శించారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు అధికార బలంతో సింగరేణి సంస్థను జేబు సంస్థగా వాడుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల నిధులను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) నిధుల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. గనుల ప్రభావిత ప్రాంతంలో వినియోగించాల్సిన డిఎంఎఫ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో వినియోగిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ జెన్‌కో సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.9,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ బకాయిల కారణంగా సంస్థపై అనవసర ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిని మరింత బలోపేతం చేసి, పారదర్శక పాలనతో కార్మికుల సంక్షేమాన్ని కాపాడుతూ సంస్థను తిరిగి లాభాల బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ, సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి సంస్థ అని అన్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నీ బీజేపీ సహించదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిని దేశంలోనే ఆదర్శ ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దుతామని, కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

తాడిచర్ల కోల్ బ్లాక్ -2 రాష్ట్రానికి మణికిరీటం…


తాడిచర్ల కోల్ బ్లాక్-2 తెలంగాణ రాష్ట్రానికే మణికిరీటంగా నిలవబోతోందని, సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద బొగ్గు గనిగా ఇది అభివృద్ధి చెందనున్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణీ భరోసా యాత్రలో భాగంగా మంగళవారం తాడిచర్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న తాడిచర్ల కోల్ బ్లాక్-2ను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. దక్షిణ భారతదే శంలోనే, తెలంగాణలోనే అతిపెద్ద కోల్ బ్లాక్ తాడిచర్ల కోల్ బ్లాక్-2 నిలవబోతోందని ఇది బాహుబలి కోల్ మైన్ అని అభివర్ణించారు. ఈ గని సుమారు 40 నుంచి 50 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని, దాదాపు 350 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఈ గని ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తాడిచర్ల కోల్ బ్లాక్-2 ద్వారా 2 వేల శాశ్వత ఉద్యోగాలు, 5 వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభించనున్నాయని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి , ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ , వెంకటరమణారెడ్డి , పైడి రాకేష్ రెడ్డి , రామారావు పటేల్, బీజేపీ రాష్ట్ర, కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, చల్లా నారాయణరెడ్డి, రాష్ట్ర జిల్లా మండల నాయకులు, బీఎంఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this:
error: Content is protected !!